25వ అధ్యాయము
అంబరీషుడు ధర్మసంకటమున జలపారణము, దుర్వాసశాపదానము సుదర్శన ప్రయోగము

బ్రాహ్మణులిట్లు చెప్పిరి. అంబరీష మహారాజా ! నీకిప్పుడు రెండు ప్రకల్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్తులముగాము. పారణను ఆపితిమా హరి భక్తికి లోపముగలుగును. పారణ చేయించి తిమా దుర్వాసునుడు శాపమిచ్చును. కనుక యెట్లయినను కీడురాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము.
బ్రాహ్మణులిట్లు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయ మును యిట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణులారా ! హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణశాపము కొంచెము మంచిది. నేనిప్పుడు కొంచెము జలముచేత పారణ చేసెదను. ఈ జలపానము భక్షణ మగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట శ్రుత్యర్థబోధక ప్రమాణము “కర్తుం సాధ్యం యదానాలం ద్వాదశ్యద్బిస్తు పారయేత్ | కృతాపః ప్రాశనా తృశ్చాద్బుంజీత్యే త్యపంజగురితి” కాబట్టి జలపారణముచేత ద్వాదశ్యతిక్రమణ దోషమురాదు. బ్రాహ్మణ తిరస్కారమున్ను ఉండదు. ఇట్లు చేసినయెడల దుర్వాససుడు శపించడు. నా జన్మాంతర పాతకము నశించును.
రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతికోపముతో నేత్రములతో దహించువాడువలె అంబరీష మహారాజును జూచి చెవులకు వినశక్యముగాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను. ఓ రాజా! అతిధిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదలిధర్మభంగకారణియైన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి.
స్నానమాచరించక భుజించువాడు ఇతరులకు పెట్టకతాను ఒక్కడే భుజించినవాడు అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగువలె మలాశి యగును. ఆత్మార్గము వంట చేసికొన్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరం పరను భుజించుచున్నవాడగును.
అగ్నిపక్వమైనదిగాని, పక్వముగానిదిగాని, ఆకుగాని, పుష్పముగాని, ఫలముగాని, పాలుగాని అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమేయగును. నీవు అంగీకృతుడనయిన అతిథిని నన్ను వదలి దూషితబుద్ధిగలవాడవై అన్నప్రతినిధియగు జలమును త్రాగితివి.
బ్రాహ్మణతిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరిమందుడా! ఎప్పడయినను బ్రాహ్మణులను తిరస్కారముచేయవచ్చునా? నీకు హరిదేవు డెట్లగును? అతనియందు నీ భక్తియెట్టిది? బ్రాహ్మణ విషయమందును, హరి విషయమందును నీకంటే పాపాత్ముడులేడు. నీవు బ్రాహ్మణుడయిన నన్ను వదలి భుజించితివి గాన
బ్రాహ్మణతిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరినిగూడ తిరస్కరించినవాడవైతివి.
రాజా ! ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదముచేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరీ ! నీవు ధర్మాత్ముడనని పేరు పెట్కుని ధర్మమార్గములను నశింపజేయుచున్నావు. ఓరీ పాపాత్మా ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించ వత్తురు. నీవు దుర్మార్గుడవు. గనుక వారిని బాధించెదవు. కాబట్టి నీవు ధర్మకంటకుడ వగుదువు.
దుర్వాససుడిట్లు పలుకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి యిట్లని ప్రార్థించెను. అయ్యా ! నేను పాపుడను, పాపకర్ముడను, పాపమానసుడను, నిన్ను శరణువేడెదను. నన్ను రక్షించుమనికోరెను. నేను ధర్మమారమును దెలియక పాపమను బురదయందుపడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణువేడుచున్నాను. నన్ను రక్షించుము.
నేను క్షత్రియుడను. పాపములను జేసితివి. నీవు బ్రాహ్మణుడవు. శాంతి రూపుడవు. కనుక నన్ను ఎల్లప్పుడు తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై యుందురు. మీవంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మావంటి పాపసముద్ర మగ్నులను ఉద్దరించవలయును. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాససుడు తన ఎడమకాలితో తన్ని దూరముగాపోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి యిట్లనియె. రాజా నేను దయగలవాడనుగాను, నాకు శాంతి లేదు. ఓర్పులేనివారికి, ఆలయమైతిని గనుక దుర్వాససుడు శాంతిలేని వాడని తెలిసికొనుము.
ఇతరమునీశ్వరులందరు కోపితులై తిరిగి ప్రార్ధించిన యెడల శాంతులగుదురు గాని నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించినవానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడనుగాను. ఇట్లనిపలికి అంబరీషునుద్దేశించి శాపమిచ్చెను.
1. మత్స్యము 2. కూర్మము 3. వరామము 4. వామనుడు 5. వికృతముఖుడు 6. బ్రాహ్మణుడై క్రూరుడు 7. క్షత్రియుడై జ్ఞానశూన్యుడు 8. క్షత్రియుడై రాజ్యాధికారిగాని వాడు 9. దురాచారుడు పాషండమార్గ వేదియు 10. బ్రాహ్మణుడై రాజ్యాధికారిగానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు. నేను శాస్రార్ణవేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణునికంటే ముందు చేసితినను గర్వముతోనున్ననీకు ఈ పది జన్మలు వచ్చును. అనగా పదింటియందును గర్వమును పొందదగినది యొక్కటియు లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగకరములయిన జన్మలను ఇచ్చితిననెను.
ఇట్లు పదిశాపములను యిచ్చినన్నవమాన పరచినవానికి ఇంకా శాపమివ్వ వలయునని తలచి దుర్వాససుడు నోరు తెరచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును, భక్తి ప్రియుడును, శరణాగత వత్సలుడునునగు హరి తన భక్తుని కాపాడుతలంపుతోను,  బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోను దుర్వాసుడు ఇచ్చిన పది శాపములను తానూ గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలచి తన చక్రమును పంపెను.
తరువాత ఆ చక్రముకోటి సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మందుచుండగా నోరుతెరచుకుని పైకివచ్చెను. దానిని జూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని ఆత్మరక్షణమునకై భూమినంతయు తిరిగెను.
దుర్వాససుడు చక్రముచేత భూచక్రమంతయు తిరిగింపబడెను గాని చక్రభయము చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దికాల్పలకులును, వశిష్టాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలును దుర్వాసనుని రక్షింపలేరయిరి. ఇట్లు తపస్సు చేసికొను మునీశ్వరుని అతికోపముచేత బుద్ధిచెడి హరిభక్తునకు అవమానమును జేయుటచేత దుర్వాసనునకు ప్రాణసంకటముతటస్థించెను.