7వ అధ్యాయము
కార్తికమాసకర్తవ్య వివిధ ధర్మాలు

వసిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా ! కార్తిక మహాత్మ్యమును యింకా చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. కార్తికమాసమందు ఎవడు పద్మములచేత పద్మముల వంటి నేత్రములుగల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మిదేవి నిత్యనివాసము చేయును.
కార్తికమాసమందు భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. కార్తికమాసమందు మారేడు దళములతో సర్వవాకుడయిన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. కార్తికమాస మందు భక్తితో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లు నశించునో అట్లు నశించును. ఉసిరిగకాయలతో ఉసిరిగ చెట్టు క్రింద హరిని పూజించు వానిని యముడు చూచుటకు కూడా సమర్గుడుకాడు. కార్తికమాసమందు తులసీదళములతో సాలగ్రామమునుపూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహము లేదు. కార్తిక మాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువాని యొక్క కోటానుకోట్ల పాపాలు నశించును.
కార్తికమాసమందు బ్రాహ్మణులతో గూడా ఉసిరిగ చెట్టు దగ్గర సాల గ్రామమును పూజించువాడు వైకుంఠమునకుపోయి అచ్చట విషువువలె ఆనందించుచుండును. కార్తికమాసమందు భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. కార్తికమాసమందు హరికి అరటి స్తంభములతోగాని, పుష్పములతోగాని మంటపమును నిర్మించి పూజించువాడు చిరకాలము వైకుంఠమందుం డును. కార్తికమాసమందు ఒక్కమారయినను హరిముందు దండప్రణామమాచ రించు వారు పాపవిముక్తులై అశ్వమేధయాగఫలము పొందుదురు.
కార్తికమాసమందు హరిముందు జపము, హోమము, దేవతార్చనము చేయువారు తమ పితరులతో కూడా వైకుంఠమునకు బోవుదురు. కార్తిక మాసమందు స్నానముచేసి తడిబట్టతో ఉన్నవానికి చలితోవణుకువానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును. కార్తికమాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోపణము చేయువాని పాపములు గాలికి దుమ్ము ఎగిరిపోవునట్లు నశించును. –
కార్తికమాసమందు బృందావనమందు ఆవుపేడతో అలికి 5 రంగులతోను శంఖ పద్మ స్వస్తికాది ముగ్గులు పెట్టిన స్త్రీ హరికి ప్రియురాలగును. కార్తికమాసమందు విష్ణు సన్నిధిలో నందాదీపమును అర్పించిన పుణ్యము యొక్క గొప్పతనము జెప్పుట బ్రహ్మకు కూడా శక్యముగాదు. పర్వతిథులలో పెట్టిన దీపమునకు నందాదీపమని పేరు. ఈ నందాదీపము నశించిన యెడల వ్రతభ్రష్టుడగును తిలలతోను, ధాన్యము తోను, అవిశపువ్వులతోను కలిపిన నందాదీపమును కార్తికమాసమందు హరికి సమర్పించ వలయును. నందా అనగా ఏకాదశి పూర్ణిమ మున్నగు పర్వతిథులందు జేయునది.
కార్తికమాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో పూజించినవారు చిరకాలము జీవించితుదకు మోక్షము పొందుదురు. కార్తికమందు విష్ణ్వాలయ మంటపమును భక్తితో అలంకరించువారు హరిమందిరమునకు వెళ్ళుదురు. కార్తికమాసమందు హరిని మల్లెపువ్వు లతో పూజించువాని పాపములు సూర్యోదయానంతరము చీకటి నశించునట్లు నశించును.
కార్తికమాసమందు తులసి గంధముతో సాలగ్రామమును పూజించు వాడు పాపవిముక్తుడై విష్ణులోకమును బొందును. కార్తిక మాసమందు హరి సన్నిధిలో స్త్రీగాని పురుషుడుగాని నాట్యము చేసిన యెడల పూర్వజన్న సంచితమైన పాతకములు గూడ నశించును.
కార్తికమాసమున విష్యాలయమందు అలంకారము చేయువాడు. చేయించువాడు వైకుంఠమందు సాయుజ్యముక్తి పొందును. కార్తికమాస మందు భక్తితో అన్నదాన మాచరించువాని పాపములు పెనుగాలిచే గాలికి మబ్బులవలె విడిపోవును. కార్తికమాస మందు తిలదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు శర్మములను జేయవలెను. బ్రహ్మపత్ర భోజనము అనగా మోదుగ ఆకుల విస్తరిలో భోజనముచేయుట. కార్తికమాసమందు స్నానము, దానము యథాశక్తిగా చేయని వాడు నూరుజన్మములందుకుక్కగా బుట్టి తరువాత చండాలుడగును. –
స్త్రీగాని, పురుషుడుగాని కార్తికవ్రతమాచరించనివారు ముందు గాడిదగా జన్మించి తరువాత నూరుమారులు కుక్కగా జన్మించుదురు. కార్తికమాసమందు కదిమ (కదంబ) పువ్వులతో హరిని పూజించువాడు సూర్యమండలమును భేదించుకుని స్వర్గమునకు బోవును. మొగలిపువ్వులతో భక్తితో హరినిబూజించువాడు ఏడుజన్మలందు వేదవేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడుగా జన్మించును.
పద్మములతో హరిని పూజించువాడు సూర్యమండలమందు చిరకాలము నివసిం చును. తానుస్వయముగా అవిసెపువ్వుల మాలను ధరించి తరువాత హరిని అవిసెపువ్వుల మాలికతో పూజించువాడు స్వర్గాధిపతి యగును. స్త్రీలు పూలమాలలచేతను తులసీదళ ములచేతను కార్తికమాసమందు హరిని పూజించినయెడల సర్వపాపనిర్ముక్తులై వైకుంఠ మును బొందుదురు. కార్తికమాసమున ఆదివారమందు స్నానముచేసిన యెడల మాస మంతయు స్నానమాచరించిన పుణ్యమును బొందుదురు.
శుద్ధపాడ్యమినాడు పూర్ణిమనాడు అమావాస్యనాడు ఈ మూడు రోజులు పాత్ర స్స్నానము చేసిన యెడల అశక్తునకు కూడా మాసస్నాన ఫలము వచ్చును. అందుకు శక్తిచాలనిచో నెలరోజులు తప్పకుండా మాసమహాత్మ్యమును వినినట్లయితే స్నానఫలము గలిగి పాపములు నశించును. దీపములను జూచి ఆనందమునొందువాని పాపములు నిశ్చయముగా నశించును. ఇతరులకు హరిపూజకొరకు మనోవాక్కాయములచేత సహా యము చేయువాడు స్వర్గమును బొందును. భక్తితో గంధపుష్ప ధూపదీపాదులచేత హరిని పూజించువాడు వైకుంఠమును బొందును.
ఈ మాసమున హరిసన్నిధిలో జపమాచరించనివాడు భూమియందు ఏడు జన్నము లందు నక్కగా జన్మించును. ఇందుకు సందేహములేదు. కార్తికమాసమున సాయంకాల మందు హరిసన్నిధిని పురాణ కాలక్షేపమును జేయువారు వైకుంఠమును జేరుదురు. కార్తికమాసమందు సాయంకాల మున ఆలయములందు స్తోత్రములను పఠించువాడు స్వర్గలోకమున కొంత కాలముండి తరువాత ధ్రువలోకము చేరి సుఖించును.