3వ అధ్యాయము
కావేరి కార్తికస్నానఫలము, తత్త్వనిష్ట చరితము

ఓ జనకమహారాజా! వినుము. కార్తికమాసమందు స్నానము దానము జపమ మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసిన యెడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలుగాని, పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తిక వ్రతమును జేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తిక పూర్ణిమ రోజున స్నానదానములు ఉపవాసమును జేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై యుండును. ఈ విషయమందొక పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.
ఆ ఇతిహాసము తత్వనిష్టునిదైయున్నది. గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిషుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్దమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగల వాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు.
రాజా! ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు బోవుచు గోదావరి తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మజ్జిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగానున్నది. శరీరము నల్లగానున్నది. ఉదరము కృశించియున్నది. నేత్రములు, గడ్డము, ముఖము ఎఱ్ఱగానున్నవి. దంతములు పొడుగుగానున్నవి. చేతిలో కత్తులపైన పుట్టెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి.
ఆ రాక్షసుల భయముచేత ఆవతవృక్షమునకు ఆఱుక్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు. ఆవటసమీపమందు పర్వత సమానశరీరులగు ఆ బ్రాహ్మరాక్షసులు నిత్యమునుపశువులు, పక్షులు, మృగములు మొదలయిన జంతుజాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకరశబ్దములను జేయుచుండెడి వారు. అనేక కార్తిక వ్రతములాచరించినా తత్త్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మజ్జిచెట్టుమీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను.
తత్త్వనిష్ఠుడు భయపడి శ్రీహరిపాదారవిందములను స్మరించుచు దేవేశా! నన్ను రక్షించుము. లోకేశా! నారాయణా! అవ్యయా! నామొర ఆలకించుము. సమస్తభయ ముల నశింపజేయు దేవా! నాభయమును పోగొట్టుము నాకు నీవేదిక్కు నీవు తప్ప నన్ను రక్షింపసమర్థులెవ్వరును లేరు. ఈ ప్రకారము హరినిగూర్చి మొఱబెట్టుచు వారిభయ మున పరుగెత్తు చున్న బ్రాహ్మణుని జూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంతదూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మ ణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి గలిగినది.
ఓ రాజా! తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమి యందు దండ ప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమా ! మీ దర్శనము వలన మేము పాపరహితుల మైతిమి. మీరాక మాకు ఉపకారము కొఱకయినది. అదిన్యాయమే. మహాత్ములు జీవించుట యాత్రచేయుట లోకమును ఉద్ధరించుటకొరకే ఉపకారము కొఱకే అగునుగదా.
బ్రాహ్మణుడీమాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియె. మీరెవ్వరు. ఏకర్మచేత మీకిట్టి వికృతరూపములు గలిగినవి. లోకనిందితమైన ఏకర్మను మీరుపూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకు జెప్పుడు. తరువాత రాక్షసులు తాముచసిన నింద్యకర్మలను వేరువేరుగా తలచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి.
మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పల్కెను. అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామధికారిని (మునసబును) బ్రాహ్మణు లలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని, నాకుటుంబ లాభము కొఱకు బ్రహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకుగాని ఒకనాడయినను అన్నమును బెట్టి యెఱుంగను. బ్రాహ్మణులసొమ్ము స్నేహముచేత హరించుటచే ఏడుతరముల కుటుం బము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన యెడల సూర్యచంద్ర నక్షత్రములుండువరకు కుటుంబము నశించును. తరువాత మృతినొంది యమబాధలను అనేకములనొందితిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమా! ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము.
అందులో రెండవ వాడిట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశమం దుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును, నా భార్య పిల్లలును షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రముచద్ది అన్న మును పెట్టుచుండువాడను, బంధువులకుగాని, బ్రాహ్మణులకు గాని ఒక నాడయినను అన్నమును పెట్టినవాడనుకాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు యెనిమిదియుగముల వరకు యమభాదలనుబొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించతిని. ఓ బ్రాహ్మణో త్తమా ! నాకీపాపముతొలగు ఉపాయము జెప్పి నన్ను ఉద్దరింపుము.
తరువాత మూడవవాడు నమస్కరించి తనస్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా! నేను ఆంధ్రదేశనివాసిని. బ్రాహ్మణుడను. విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలనుజేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయా శూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకుయిచ్చి దేవతానివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభ వించి తరువాత భూమికి వచ్చి నానాజన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై బుట్టి యీ మట్టిమీద ఉంటిని గనుక సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమా! నన్ను రక్షిం చుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము.
తత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచ మైనను భయములేదు. మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తికస్నానార్ధము పోవు చున్నాను. నాతో మీరు కూడా రండి. అని వారిని తీసుకొనిపోయి కావేరి నదిలో బ్రహ్మ రాక్షసుల నిమిత్తము రాక్షసులచేగూడ స్నానముచేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను.
“అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్స్నాన మహంకరిష్యే” ఇట్లు సంకల్పముచేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానముచేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆక్షణముననే ఆ ముగ్గురు దోషవిముక్తులై దివ్యరూపములను ధరించి వైకుంఠలోకమునకు బోయిరి.
ఓ జనకమహారాజా ! వినుము. మోహముచేతగాని, అజ్ఞానముచేత గాని కార్తిక మాసంబున శుక్రనక్షత్రముదయించినపుడు= (తెల్లవారు జామున) సూర్యోదయకాల మందు కావేరీనది యందు స్నానముచేసి పిమ్మట శ్రీవిష్ణుపూజనుజేసిన వానికి పదివేల యజ్ఞములు చేసన ఫలము కలుగును. ఇందుకు సందేహములేదు. కార్తికమాసమందు ఏదో ఒక ఉపాయముచేత కావేరీస్నానమును తప్పక చేయవలయును.
కార్తికమాసమందు దామోదరప్రీతిగా ప్రాతస్నానము జేయనివాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీగాని, పురుషుడుగాని కార్తికమాసమందు ప్రాతస్స్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.