10వ అధ్యాయము
అజామిళ పూర్వజన్మ వృత్తాంతము

జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మ మందెవ్వడు? ఏమిపాపమును జేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలనువిని యమభటులు ఎందుకు యూరకుడిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి ?
వసిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును యమునితో జెప్పిరి. అయ్యా! పాపత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించు వాడును నగు అజామిళుడు తోడి తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. –
ఆ మాటను వినికోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈ అజా మిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి.
దుష్టాత్నులై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్నికాల్పునుగదా ! భక్తితో నారాయణ స్మరణను జేయువాడు జీవన్ముక్తుడై అంతమందు మోక్షము నొందును. యముడిట్లు విచారించి యూరకుండెను.
అజామిళుడు పూర్వజన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకభిముఖముగా కాళ్ళుచాపుకుని శయనించుచు ఆయుధపాణియై స్నేహితులతోగూడి నానాలంకారశోభితుడై స్వేచ్చావిహారముల తిరుగుచు బహుభాషియై మంచి యౌవనముతో నుండెను.
ఆయూరిలో నొక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యౌవనవతియు నగు భార్యగలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నము కొఱకై పట్టణములు, గ్రామములు పల్లెలు తిఱుగుచు యాచించుచుండెడివాడు.
ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధాన్యాదికమును శిరస్సున నుంచుకొని ఆకలితో యింటికి వచ్చి భార్యతో ఓసీ! నాకు ఆకలి కలుగుచున్నది. త్వరగా వంట జేయుము. ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించెదను. భర్తయిబ్లెన్ని మాఱులడిగినను భార్య అతని మాటను లెక్కచేయకపనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యూర కుండెను. అంతభర్తకోపించి దండముతో భార్యను గొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరముబోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు భార్యాసంగతిని గూర్చి చింతించు చుండెను. భార్యయు సుఖముగానుండి రాత్రి భుజించి మంచి చీరెధరించి తాంబూలము స్వీకరించి యొక చాకలివాని ఇంటికి పోయెను.
సుందరుడయిన చాకలివానిని జూచి రాత్రి నాతో సంభోగించు మనెను. ఆ మాటవిని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీని అర్థరాత్రివేళ మాయింటికి రావచ్చునా? మీరుగొప్పకులమునందు బుట్టినవారు మేము నిందితులము కాబట్టి యిట్టి సంపర్కము మీకు తగునా?
ఈ ప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో దానిని కొట్టెను. అదియు వానినికొట్టి వానిని విడిచి రాజమార్గమున బోవుచుండగా పైన జెప్పిన శివార్చకుని జూచెను. అంతలో ఆ స్త్రీవానిని పట్టుకుని రతికేళి రమ్మనమని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రియంతయు వానితో కాలక్షేపముచేసి తెల్లవారగానే పశ్చాత్తాప మును బొంది భర్త వద్దకుబోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో గూడా గృహ మందు సౌఖ్యముగా నుండెను.
తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమలోక మందు క్రమ ముగా రౌరవాది నరక దుఃఖములననుభవించి తిరిగి భూమి యందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడై జన్మించెను. ఇతనికి కార్తికపూర్ణిమనాడు శివదర్శనములభించినది. అంత్య కాలమందు హరినామ స్మరణ గలిగినది. ఆ హేతువలచేత సప్తజన్మార్జిత పాపములు నశించి మోక్షమును బొందెను.
ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతినొంది నరకములందనేక యాతనల నొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఇది పుట్టిన సమయము మంచిదా యని యొక బ్రాహ్మణుని యడిగెను. అతడు యిది తండ్రిగండాన పుట్టినదని చెప్పెను. ఆమాట విని చండాలుడు ఆ శిశువును దీసికొనిపోయి అరణ్యమందుంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు జూచి రోదనము చేయు చున్న ఆ శిశువును దీసికొనిపోయి తనయింటిలో దాసీగానున్న యొక స్త్రీకి నప్పగించెను. ఆ దాసీది దీనిని పెంచినది. తరువాత దీనిని అజామిళుడు దగ్గరకు తీసెను. తరువాత కథపూర్వోక్తమే
రాజోత్తమా ! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము అజామిళుని పూర్వ వృత్తాం తము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము, హరినామకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అదిగాని యెడల ధర్మశాసోక్ష ప్రాయశ్చిత్తములు చేయవలె నని భావము.
ఎవ్వనియొక్క నాలుక హరినామ కీర్తి నముచేయదో, మనస్సు హరిపాదపద్మ మునుస్మరించదో, చెవులు హరిచరిత్రములను వినదో వానిపాపములు యెట్లు నశిం చును? ఇతర చింతనుమాని హరినిస్మరించువారు ముక్తినొందెదరు. ఇందుకు సందియము లేదు. కాబట్టి కారకమాసమందాచరించిన ధర్మము సూక్ష్మమైనదైనను గొప్ప దైనను పాపము అంతటిని నశింపజేయును. కార్తికధర్మమునకు పాపములను నశింపజేయు సామర్థ్యమున్నది కాబట్టి కార్తిక మాసమందు ధర్మ మాచరించనివాడు నరకము నొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమొందుదురు.
ఈకథను వినిపించువాడు పాపవిముక్తుడై వైకుంఠమందు విష్ణువుతో గూడి సుఖించును.